ప్రస్తుతం బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది వ్యాయామానికి దూరమవుతున్నారు. తక్కువ శారీరక శ్రమ, డెస్క్ జాబ్స్ వల్ల చిన్నవయసులోనే అధిక బరువు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎక్సర్సైస్ చేయడానికి టైమ్ లేనివారికి సైకిలింగ్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయని అంటున్నారు. రోజూ సైక్లింగ్ చేస్తే మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. అంతేకాకుండా డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, అలసట వంటి మానసిక సమస్యలకు దూరమవుతారు. అరగంట సేపు తొక్కడం వల్ల శరీరంలో 250 క్యాలరీలు కరిగిపోతాయి. సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని కండరాల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు మరింత బలంగా మారుతాయి.రోజూ ఉదయాన్నే సైకిల్ తొక్కితే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. రెస్టింగ్ పల్స్ తగ్గించి, గుండె కండరాలను బలపరుస్తుంది, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. పద్దతి ప్రకారం ప్రతిరోజూ సైక్లింగ్ చేయటం మీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ హృదయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
రోజూ సైక్లింగ్ చేస్తే పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే మహిళలు సైకిల్ తొక్కితే బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రమాదం 60 శాతం తగ్గుతుందట. కీళ్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మధుమేహం రావడానికి ముఖ్య కారణం ఏ పని చేయకపోవడం. అయితే, రోజుకి 30 నిమిషాలు సైకిల్ తొక్కితే శరీరంలో గ్లూకోజ్ పరిమాణం తగ్గి టైప్ 1, టైప్ 2 మధుమేహం కంట్రోల్ అవుతుంది. ఈ వ్యక్తులకు మధుమేహం వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువగా ఉంటుందని ఫిన్లాండ్‌లో నిర్వహించిన ఓ పరిశోధనలో గుర్తించారు. ఇక బరువు తగ్గాలనుకునేవారికి సైక్లింగ్ బెస్ట్ వర్కౌట్. దీని వల్ల గంటకి దాదాపు 1200 కేలరీలు బర్న్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం మంచిది. సైకిలింగ్ కండరాలను పెంచుతుంది. జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది, శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీ రొటీన్‌లో సైక్లింగ్‌ను కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు.