ఒత్తిడి స్థాయిలను బ్యాలెన్స్ చేసే మైక్రో బ్రేక్
************************
నిరంతరం పని చేసినప్పుడు సృజనాత్మకత కూడా కాస్త తగ్గుతుంది. మెదడు సరిగ్గా ఆలోచించలేకపోతుంది. అలాంటప్పుడు సృజనాత్మకతను పెంచడానికి మైక్రో బ్రేక్ మంచి మార్గం. దీనివల్ల మనస్సు సరికొత్త మార్గంలో ఆలోచించగలుగుతుంది. చిన్న బ్రేక్ అనేది లైఫ్ లో చాలా పెద్ద విషయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనలో చాలా మంది వారం అంతా పని చేసి వీకెండ్స్ లో రిలాక్స్ అవుదాం అనుకుంటారు. కానీ అది పెద్ద ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న విరామాలు తీసుకోవటం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడచ్చు అని చెబుతున్నారు. మైక్రో బ్రేక్ మనల్ని రీఛార్జ్ చేస్తుంది. ఫోకస్, స్టామినాలను పెంచుతుంది.
మైక్రో బ్రేక్ అంటే 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో ఉండే చిన్న విరామాలు. ఇవి ఒత్తిడి స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. మైక్రో బ్రేక్ ఫోకస్, వర్కింగ్ కెపాసిటీ రెండింటినీ పెంచడంలో సహాయపడుతుంది. ఈ బ్రేక్ సమయంలో సంగీతం వినాలి, లేదా నచ్చిన స్నేహితులతో మాట్లాడాలి. అప్పుడే దాని పూర్తి ప్రయోజనాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయాలనుకోవటం వల్ల తీవ్రమైన ఒత్తిడి, ఆ పని పూర్తి కాకపోతే నిరాశ కలుగుతుంది. కానీ ఈ స్మాల్ బ్రేక్స్ వల్ల ఒత్తిడి, డిప్రెషన్ రెండింటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మైక్రో బ్రేక్ వల్ల గుండె, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. వర్క్ ప్లేస్ లో మైక్రోబ్రేక్‌లను తీసుకోవటం ద్వారా , ఉద్యోగులు తమ పని పై మరింత నియంత్రణను కలిగి ఉంటారు, తద్వారా వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీ బ్రేక్ సమయంలో మీరు ఏం చేస్తారన్నది మీ ఇష్టం, కానీ ఇష్టమైనపని చేయటం వల్ల మైక్రో బ్రేక్ తరువాతి సమయాన్ని మాత్రం మీరు మరింత మంచిగా వినియోగించుకుంటారని నిపుణులు చెబుతున్నారు.