మహిళలకు అవసరమైన పోషకాహారాలు!


మహిళలకు ఆహారంలో అవసరమైన పోషకాలివీ!

మహిళలు గతంలో కన్నా నేటి కాలంలో పురుషులతో పోటీపడుతూ వివిధ రంగాలలో రాణిస్తున్నారు. ఇంట్లో పనులు చక్కదిద్దుకుంటా, పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుంటూ, ఆఫీసుల్లోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఏ రంగంలో అయినా, ఏ పనిలో అయినా వాళ్ల మార్క్‌ కచ్చితంగా వదులుతున్నారు. అయితే, వృత్తి ఉద్యోగాలు, ఇంటి పనుల బిజీలో పడిపోయి చాలామంది తమకు తాము టైమ్‌ కేటాయించుకోలేకపోతున్నారు. వారు తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ వహించడం లేదు. ఈ పూటకి ఏదో ఒకటి తిన్నామా.. కడుపు నిండిందా అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే మహిళలు పోషకాహారం విషయంలో మరింత శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ శరీరంలో ఎన్నో మార్పులకు గురవుతూ ఉంటుంది.. పీరియడ్స్‌, ప్రెగ్నెన్సీ, మెనోపాజ్‌. వారి శరీరంలో అనేక హార్మన్లు మార్పులకు గురవుతూ ఉంటాయి. మహిళలల్లో పోషకాహార లోపం నెలసరి ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువగా ఐరన్‌ లోపం
మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. నెలనెలా నెలసరి సమయంలో మహిళల శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం బయటకు వెళ్తుంది. దీని కారణంగా వారిలో ఐరన్‌ లోపం ఎక్కువగా ఉంటుంది. మహిళలు పీరియడ్స్‌ సమయంలో 30 %, ప్రెగ్నెన్సీ సమయంలో 42 % ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఐరన్‌లో లోపం కారణంగా.. నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం అవ్వడం, తల తిరగడం, విపరీతమైన అలసట, శ్వాస ఆడకపోవడం, గోళ్లు పెళుసుగా మారడం, నీరసం, అలసం వంటి సమస్యలు ఎదురవుతాయి. మహిళలు ఐరన్‌ లోపం దూరం చేసుకోవడానికి.. మాంసం, చేపలు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్‌, బీన్స్‌, పప్పుధాన్యాలు, సోయా, టొమాటో, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, ఖర్జూరం, బఠాణీలు, సీజనల్‌ పండ్లు వారి డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కాల్షియం తగ్గటం
కాల్షియం మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన మినరల్‌. ఇది శరీరంలో ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాల నిర్మాణానికి సహాయపడుతుంది. మహిళల్లో ఎముకల క్షీణత సమస్య పెరుగుతోంది. కాల్షియం లోపం కారణంగా ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపెనియా వంటి సమస్యలు ఆడవాళ్లలో ఎక్కువ అవుతున్నాయి. కాల్షియం లోపం 8-19 సంవత్సరాల మధ్య వయస్సు గల అమ్మాయిలలో, 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. కాల్షియం లోపం కారణంగా విపరీతమైన అలసట, బలహీనత, తరచుగా కండరాల తిమ్మిరి, చర్మ సమస్యలు, ఎముకలు బలహీనపడటం, దంత సమస్యలు, సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మహిళలు కాల్షియం లోపం దూరం చేసుకోవడానికి.. పాలు, పెరుగు, చీజ్, సోయాబీన్స్, ఆకుకూరలు, చేపలు, తృణధాన్యాలు వంటి ఆహరం ఎక్కువగా తీసుకోవాలి.

ఫోలెట్‌ లోపం
ఫోలెట్‌ను విటమిన్‌ బి9 అని కూడా అంటారు. ఇది మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. ఫోలెట్‌ ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదల, పనితీరుకు సహాయపడుతుంది. ఫోలెట్‌ లోపిస్తే.. మన శరీరంలో రక్తహీనత తలెత్తుతుందంటున్నారు నిపుణులు. గర్భిణుల్లో ఇది లోపిస్తే పుట్టబోయే పిల్లల నాడీ వ్యవస్థలో లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫోలేట్ లోపం వల్ల విపరీతమైన అలసట, నీరసం, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, తలతిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, కూరగాయలు, బీన్స్, పండ్లు, తృణధాన్యాలు, సీఫుడ్, లివర్‌, నట్స్‌ విత్తనాలు, బ్రకలీ, శెనగలు, పప్పుధాన్యాల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది.

విటమిన్‌-డి
విటమిన్‌-డి శరీర ఆరోగ్యకరమైన పనితీరుకు సహాయపడుతుంది. మహిళల్లో అండం నాణ్యతను పెంచి, సంతాన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్‌-డిని ప్రధాన పోషకంగా పేర్కొంటారు నిపుణులు. సంతాన సమస్యల్ని దూరం చేసుకోవాలంటే విటమిన్‌-డి పొందడం చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల ఆయాసం, వెన్నునొప్పి, జుట్టు రాలడం, గాయాలు మానకపోవడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్‌ డీ పొందాలంటే.. ఉదయాన్నే నీరెండలో ఓ అరగంట పాటు ఉండడంతో పాటు పాలు, పెరుగు, చేపలు, గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు, మాంసం, చిలగడదుంప, అవకాడో.. వంటి పదార్థాల్ని రోజూ డైట్‌లో చేర్చుకోవాలి.

విటమిన్‌-బి12
విటమిన్‌ బి12 మెదడు, నరాల కణాల అభివృద్ధికి సహయపడటమే కాకుండా డి.ఎన్.ఏ. ఉత్పత్తిని సులభతరం చేస్తుంది. మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టిన మహిళలకు విటమిన్‌ బి-12 అవసరం ఎక్కువగా ఉంటుంది. అది లోపిస్తే రక్తహీనతకు దారితీస్తుంది. అలాగే నీరసం, అలసట, బరువు తగ్గడం, మతిమరుపు, ఆందోళన.. వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళలు బి-12 అధికంగా లభించే చేపలు, మాంసం, గుడ్లు, పాలు, పెరుగు, సెరల్స్‌.. వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

అయోడిన్‌ లోపం
అయోడిన్ శరీరంలోని థైరాయిడ్ గ్రంధి పనితీరుకు, థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరంలో అయోడిన్ స్థాయి తక్కువగా ఉంటే, థైరాయిడ్ గ్రంధి విస్తరించి, గాయిటర్ అనే సమస్య వస్తుంది. కొంతమంది బరువు పెరుగుతారు. దీంతో పాటు శరీరం బలహీనత, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. మహిళలు అయోడిన్‌ లోపం దూరం చేసుకోవడానికి.. తృణధాన్యాలు, పాలు, ఉప్పు, గుడ్లు, చికెన్, సీవీడ్, బచ్చలికూర, టమోటాలు తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Scroll to Top