ఆరోగ్యాన్ని కాపాడడంలో నట్స్ కీ రోల్ పోషిస్తాయి. సాధారణంగా బాదం, వాల్నట్స్ ఆరోగ్యానికి మంచివే. అయితే, ఇవి కాస్తా ఖరీదైనవి. వీటి బదులు పల్లీలు తినొచ్చు. ఇవి రేటు తక్కువ.. పోషకాలని ఎక్కువగా అందిస్తాయి. ఇందులో చాలా పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
పల్లీలని వేయించి తింటే చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని నూనె లేదా ఉప్పుతో వేయిస్తారు. కానీ, ఇలా వేయించడం వల్ల ఇందులోని పోషకాలు మనకి పూర్తిగా లభించవు. ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు. దీని బదులు వీటిని ఉడకబెట్టి తింటే చాలా మంచిది. దీని వల్ల ఎలాంటి లాభాలున్నాయంటే..
పల్లీల్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని ఉడికించడం వల్ల ఫైబర్ ఎక్కువగా అవుతుంది. పల్లీల్లోని ఫైబర్ జీర్ణక్రియకి మంచిది. దీనిని తీసుకోవడం వల్ల ఆపానవాయువు, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు, దీని వల్ల మలబద్ధకం దూరమవుతుంది. ఇందులోని పీచు ఇందుకు సాయపడుతుంది. పల్లీల్లో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. వీటిని ఉడికించి తింటే జీర్ణక్రియ ఈజీ అవుతుంది. బరువు తగ్గుతారు.
పల్లీలని ఉడికించి తినడం షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. ఇందులో మెగ్నీషియం ఇన్సులిన్ చర్యని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది.
పల్లీలు ఉడికించి తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇందులో నియాసిన్, కాపర్, మెగ్నీషియం, ఒలేయిక్ యాసిడ్, రెస్వరాట్రల్ వంటి గుండె జబ్బుల్ని దూరం చేస్తుంది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు. కాబట్టి, వీటిని ఉడికించి తినడం చాలా మంచిది.
పల్లీలను ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి తినాలి. అదే విధంగా, వీటిని ఉడికించి సలాడ్‌లా చేసి తినొచ్చు. ఉడికించిన పల్లీల్లో ఉప్పు, కారం లేదా మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు, టమాట తరుగు వేసి కలిపి సలాడ్‌లా చేసి తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.