ఆణిముత్యాలను అందించిన కె.వి.రెడ్డి

తెలుగు సినీ ఆణిముత్యాలను అందించిన కె.వి.రెడ్డి

కదిరి వెంకటరెడ్డి అంటే ఎవరికీ తెలియక పోవచ్చు. అదే కె.వి రెడ్డి అనగానే ఎన్నో ఆణిముత్యాల్లాంటి తెలుగు సినిమాలు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. కె.వి రెడ్డి సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశారు.

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో తేళ్ళమిట్ట పల్లెలో 1912 జూలై 1న కె.వి.రెడ్డి జన్మించారు. అతని పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. తల్లిదండ్రులు వెంకట రంగమ్మ, కొండారెడ్డి. చిన్నతనంలోనే అతని తండ్రి మరణించాడు. దాంతో తల్లితో పాటు తాడిపత్రిలోని అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేశారు. అకాలంలో వైధవ్యం మీద పడ్డ అతని తల్లి, జీవితం మీది వైరాగ్య భావంతో గడుపుతూ ఉండడంతో చిన్ననాట కె.వి.రెడ్డి అల్లరికి పట్టపగ్గాలు ఉండేవి కాదు.

తాడిపత్రిలో అతని బాల్యమంతా అల్లరి, ఆటపాటల్లో సంతోషంగా గడిచింది. చెరువుల్లో ఈతలు, కొండలు గుట్టలు ఎక్కడాలు, చేపలు పట్టడాలు, చెట్లూ పుట్టల వెంబడి తిరగడాలు, మహిమలు చేసే శక్తులు సంపాదించేందుకు శ్మశానాల్లో ఎముకలు సేకరించడం వంటి సాహసాలు, అల్లరులు చేసేవారు. ఒకసారి అడవుల్లో తిరుగుతూ కె.వి.రెడ్డి, అతని మిత్రులు ఎలుగుబంటి కనిపిస్తే దాని మీద రాళ్ళు వేసి దాన్ని రెచ్చగొట్టారు. అది కోపంతో వెంబడిస్తే అందరూ పారిపోయారు. పారిపోతున్న పిల్లలని వదిలి ఎలుగుబంటి వెనక్కి వచ్చి చూస్తే కె.వి.రెడ్డి మాత్రం భయం వల్ల దారితోచక అక్కడే ఉండిపోయారు. భయంతో వణుకుతున్న కె.వి.రెడ్డిని చూసి అది జాలిపడి విడిచిపెట్టేస్తే అతని ప్రాణాలు దక్కాయి. ఈ సంఘటన తర్వాతికాలంలో గుర్తుచేసుకున్న కె.వి.రెడ్డి “జంతువులకు కూడా జాలి, దయ వంటి సుగుణాలు ఉంటాయని ఆ సంఘటన వల్లే తెలిసిందని” చెప్పారు. గుణసుందరి కథ సినిమాలో ఎలుగుబంటి పాత్ర రూపకల్పన వెనుక చిన్నతనంలో అతను చూసిన జాలిగుండె గల ఎలుగుబంటి స్మృతి ఉంది.

కె.వి.రెడ్డి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తన మేనమామల వద్ద పెరిగారు. చిన్నతనంలో అతని అల్లరికి పట్టపగ్గాలు ఉండేవి కాదు. చదువూ చక్కగానే చదివేవారు. తర్వాతి కాలంలో తనను సినిమా రంగంలోకి తీసుకువచ్చి దర్శకుడిని చేసిన వ్యాపారవేత్త మూలా నారాయణస్వామితో తాడిపత్రిలోనే కలిసి చదువుకున్నారు. మేనమామల ప్రోద్బలంతో, సహాయంతో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరిన కె.వి. అక్కడే మెట్రిక్, డిగ్రీ పూర్తిచేశారు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై, చిన్న వ్యాపారం చేస్తూండగా మూలా నారాయణస్వామి పిలవగా సినిమా నిర్మాణ శాఖలో కెరీర్ ప్రారంభించారు.

వాహినీ పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజరుగా ప్రారంభమై 1942లో భక్త పోతన సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమా మంచి విజయం కావడంతో వాహినీ ప్రొడక్షన్స్ ఏర్పడి, అందులో కె.వి.రెడ్డి నిర్మాణ భాగస్వామిగా చేరారు. ఆపైన ప్రధానంగా వాహినీ, విజయా వంటి నిర్మాణ సంస్థల్లో సినిమాలు తీశారు. జయంతి అనే స్వంత సంస్థ నెలకొల్పి మూడు సినిమాలు తీశారు. ఇవి కాక అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఎన్.ఏ.టి. సంస్థలకు ఒక్కో సినిమా తీశారు. అతని విజయవంతమైన సినిమాల్లో మాయాబజార్ (1957) వంటి పౌరాణిక నేపథ్యం ఉన్న చిత్రం, శ్రీకృష్ణార్జున యుద్ధము (1963), శ్రీకృష్ణసత్య (1972) వంటి పౌరాణిక చిత్రాలు, గుణసుందరి కథ (1949), పాతాళ భైరవి (1951), జగదేకవీరుని కథ (1961) వంటి జానపదాలు, పెద్దమనుషులు (1954), దొంగ రాముడు (1955) వంటి సాంఘిక చిత్రాలు, భక్త పోతన (1943), యోగివేమన (1947) వంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు ఉన్నాయి. కె.వి.రెడ్డి సినిమాలు భారీ విజయాలు సాధించి, నిర్మాణ సంస్థలకు విపరీతమైన లాభాలు, ఎంతో పేరు తెచ్చిపెట్టేవి. దీనితో 1950ల్లో మొదలై 60ల తొలినాళ్ళ వరకూ అతనితో సినిమాలు తీయడానికి పోటీపడే పరిస్థితి ఉండేది. 60వ దశకం మలి భాగంలో కె.వి.రెడ్డి తీసిన సత్య హరిశ్చంద్ర (1964), ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968), భాగ్యచక్రం (1968) సినిమాలు వరుసగా పరాజయం పాలు కావడంతో అతనితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకురాని స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో కె.వి. రెడ్డిని గురువుగా భావించే ఎన్.టి.రామారావు అతనిపై గౌరవాభిమానాల వల్ల తన స్వంత సంస్థ అయిన ఎన్.ఏ.టి. ద్వారా శ్రీకృష్ణసత్య (1971) సినిమా తీయించారు. పరాజయాల వల్ల సినిమా తీసే అవకాశం లేని దుస్థితిలో కెరీర్ ముగించాల్సి వస్తుందన్న భయాందోళనల నుంచి విడిపిస్తూ ఆ సినిమా మంచి విజయం సాధించింది. మంచి సినిమా తీసిన సంతృప్తితో 1972లో కె.వి.రెడ్డి మరణించారు.

కె.వి.రెడ్డికి దర్శకత్వంలో ప్రత్యేకమైన పద్ధతి ఉండేది. ఒక సినిమా చేసేప్పుడు పూర్తి శ్రద్ధ దాని మీదే పెట్టేవారు. చాలా కసరత్తు చేసి స్క్రిప్టు పూర్తిచేయడం, ఒక్కసారి బౌండ్ స్క్రిప్టు పూర్తయ్యాకా ఇక దానిలో చిత్రీకరణ దశలో ఏమాత్రం మార్పుచేయకపోవడం అతని పద్ధతి. ఆ స్క్రిప్టు కూడా కె.వి. స్క్రిప్టు చేతిలో ఉంటే ఎవరైనా దర్శకత్వం చేయవచ్చు అనే స్థాయిలో ఉండేది. ఎన్ని అడుగుల ఫిల్మ్ తీయాలనుకుంటే అన్నే అడుగులు తీయగలగడం అతని ప్రత్యేకతల్లో ఒకటి. ముందు రిహార్సల్స్ చేయించి, సంతృప్తిగా వచ్చాకే షూటింగ్ చేసేవారు. దుక్కిపాటి మధుసూదనరావు, ఎన్.టి.రామారావులు తమకు కె.వి.రెడ్డి గురుతుల్యుడని చెప్పుకునేవారు. అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించాకా తొలి చిత్రం కె.వి.రెడ్డితో తీసి, అతని పద్ధతులు నేర్చుకుని, తమ సంస్థను ఆ ప్రకారం నడుపుదామన్న ఉద్దేశంతో రెండేళ్ళు వేచి చూసి మరీ సినిమా తీశారు. ఎన్.టి.రామారావు తాను దర్శకత్వం వహించడం మొదలుపెట్టాకా కె.వి.రెడ్డిని చూసి నేర్చుకున్న పద్ధతులను సాధ్యమైనంత అనుసరించేవారు. కె.వి.రెడ్డి తీసిన భక్త పోతన సినిమా విజయం వల్ల వాహినీ ప్రొడక్షన్స్ (అంతకుముందున్న వాహినీ పిక్చర్స్ పంపిణీ సంస్థగా మిగిలిపోయింది) ఏర్పడగా, పాతాళ భైరవి సాధించిన ఆర్థిక విజయం విజయా సంస్థ స్థిరపడడానికి సహకరించింది. ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, అల్లు రామలింగయ్య వంటి నటులు, పింగళి నాగేంద్రరావు, డి.వి.నరసరాజు, కొసరాజు రాఘవయ్య చౌదరి వంటి కవి రచయితల సినిమా కెరీర్లు స్థిరపడడానికి కె.వి.రెడ్డి సినిమాల ప్రభావం చాలా ఉంది. ప్రత్యేకించి అప్పటివరకూ కృష్ణుడి పాత్రలో పెద్దగా విజయం సాధించని ఎన్.టి.రామారావును కృష్ణుడిగా నిలబెట్టి, అతని పౌరాణిక చిత్రాల కెరీర్ కు పునాదులు వేసింది కె.వి.రెడ్డే. అతని సినిమాల్లో పెద్దమనుషులు, పెళ్లినాటి ప్రమాణాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ బహుమతి సంపాదించుకోగా 2013లో సిఎన్ఎన్-న్యూస్ 18 నిర్వహించిన పోల్లో భారతీయ ప్రేక్షకులు ఇప్పటివరకూ వచ్చిన భారతీయ సినిమాల్లో అత్యుత్తమంగా మాయాబజార్ ను ఎంచుకున్నారు.

Scroll to Top