– చిత్రసీమలో విషాదం
– ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన కె విశ్వనాథ్
కళాతపస్విగా చిరయశస్సుపొందిన కె. విశ్వనాథ్ కన్నుమూశారు. కమర్షియల్ చిత్రాలతో సమకాలీన దర్శకులు పోటీపడుతున్న కాలంలోనూ కళాత్మక సినిమాలు రూపొందిస్తూ కళను బతికించిన దిగ్గజ దర్శకులు కె విశ్వనాథ్. నాలుగు దశాబ్దాలకు పైగా దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో ప్రస్థానం కొనసాగించిన ఆయన 92 ఏళ్ల వయసులో గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1957లో సౌండ్ ఇంజనీర్‌గా కెరీర్ మొదలుపెట్టి, తదనంతరం అనేక చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు.
కొద్ది రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కె.విశ్వనాథ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే, గురువారం అర్ధరాత్రి సమయంలో కె.విశ్వనాథ్ కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.
గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామంలో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని విశ్వనాథ్ జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. విశ్వనాథ్ పాఠశాల విద్య అంతా విజయవాడలో చేశారు. గుంటూరు హిందూ కాలేజీ, ఏసీ కాలేజీల్లో కాలేజీ విద్య పూర్తి చేశారు. బీఎస్సీ డిగ్రీ పట్టా తీసుకున్నారు.
సౌండ్ రికార్డిస్టుగా మొదలై…
చెన్నైలోని ఓ స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా కె.విశ్వనాథ్ సినిమా జీవితాన్ని మొదలుపెట్టారు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్లు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. కె విశ్వనాథ్ మొత్తం 60 సినిమాలకు దర్శకత్వం వహించారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం, సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి ఎన్నో క్లాసిక్స్ అందించారు. అలాగే, నటుడిగానూ ఎన్నో గొప్ప పాత్రల్లో కె.విశ్వనాథ్ జీవించారు.
శంకరాభరణానికి జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారికంగా ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. 2016లో విశ్వనాథ్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆయన మరణంతో తెలుగు ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచేయగా.. విశ్వనాథ్ గారితో తమకున్న జ్ఞాపకాలు నెమరేసుకుంటున్నారు.
సినీ ప్రస్థానంలో విశేషాలు
1957లో వచ్చిన ‘తోడికోడళ్లు’ సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా సినిమా కెరీర్ ప్రారంభించారు విశ్వనాథ్. ఆ చిత్ర సమయంలో ఆయన పనితనం గమనించిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, విశ్వనాథ్‌కు సహాయ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆయన దగ్గరే ‘ఇద్దరుమిత్రులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘మూగమనసులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి అక్కినేని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు విశ్వనాథ్.ఆ పరిచయంతో 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు ఏఎన్నార్. ఆ సినిమా విజయం సాధించినా ఆయనకు వెంటనే అవకాశాలు రాలేదు. మొదట్లో కొన్ని కమర్షియల్ చిత్రాలకు డైరెక్ట్ చేసాడు విశ్వనాథ్ .
ఆయన పేరు చెబితే ఒక ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరిసిరిమువ్వ’ సినిమాలు గుర్తుకువస్తాయి. తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దిగ్దర్శకుడు. తెలుగు సినిమాకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్భాందవుడు. తెలుగు సినిమాల్లో సంగీతానికి పెద్ద పీటవేసి, శృతిలయలు నేర్పిన దర్శకయశస్వీ, ఆయన కళాతపస్వి..దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె.విశ్వనాథ్.
ఇక కళా తపస్వికి పేరు తెచ్చిన చిత్రం మాత్రం శోభన్ బాబు హీరోగా వచ్చిన ‘చెల్లెలి కాపురం’. అప్పటి వరకు అందాల హీరోగా పేరున్న శోభన్ బాబుచేత ఈ సినిమాలో డీగ్లామర్ రోల్ చేయించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఆ తరువాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘శారద’, ‘సిరి సిరి మువ్వ’ చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఆయన సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘శంకరాభరణం’. పాశ్చాత్య సంగీతహోరులో కొట్టుకుపోతున్న సంగీతాభిమానులకు.. సంప్రదాయ సంగీతంలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా వుంటుందో గుర్తుచేసిందీ చిత్రం. శంకరాభరణం తరువాత చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయసంగీతం నేర్పించడానికి ఉత్సాహం చూపించారు. ప్రధాన పాత్రధారి జె.వి.సోమయాజులుకు ‘శంకరాభరణం శంకరశాస్త్రి’ గా పేరు స్థిరపడేటట్టు చేసిందీ చిత్రం. ఈ చిత్ర విజయానికి మహాదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం, బాలు గాత్రం, జంధ్యాల మాటలు జతకలిసాయి. కేవీమహదేవన్కు, దివంగత పద్మవిభూషణ్ బాలుకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అవార్డులు లభించాయి. ఈ సినిమా విడుదలైన రోజే విశ్వనాథ్ శివైక్యం చెందారు.
కమల్ హాసన్ తో ఆయన తీసిన స్వాతిముత్యం.. ఆస్కార్ బరిలో భారత అధికారిక ఎంట్రీగా ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. కమల్ ఇందులో పండించిన అమాయక నటన తర్వాతి కాలంలో చాలా మంది హీరోలు ఫాలో అయి సక్సెస్ సాధించారు.పూర్ణోదయ సంస్థ అధిపతి ఏడిద నాగేశ్వర్రావు తో కేవీకి ఉన్న అనుబంధం విడదీయరానిది. వారి కాంబినేషన్ లో వచ్చిన ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వయంకృషి’, ‘స్వాతిముత్యం’, ‘స్వర్ణ కమలం’ ‘ఆపద్భాందవుడు’ ‘స్వాతి కిరణం’ వంటి విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.
హీరో గుడ్డివాడు , హీరోయిన్ మూగ అమ్మాయి.. ఇలాంటి కథతో సినిమా ఏంటి అన్న నోళ్లతో సినిమాతీసి సక్సెస్ సాధించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ‘సిరి వెన్నెల’ చిత్రంలో గుడ్డివాడిగా సర్వదమన్ బెనర్జీ , మూగ అమ్మాయిగా సుహాసిని నటన మనం ఇప్పటికీ మరచిపోలేం. ఈ సినిమాతో పాటల రచయత దివంగత సీతారామశాస్త్రి ఇంటి పేరు ‘సిరివెన్నెల‘ గా మారిపోయింది.
అనేక సామాజిక కథాంశాలతో తీసిన చిత్రాలు విజయాన్ని నమోదు చేసాయి. వరకట్న సమస్యపై ‘శుభలేఖ’, కులవ్యవస్థపై ‘సప్తపది’, గంగిరెద్దు వాళ్ల జీవితంగౌ ఆధారంగా ‘సూత్రధారులు’, బద్దకస్తుడి కథ ఆధారంగా ‘శుభోదయం’ చిత్రాలు ఆయనలోని సంఘ సంస్కర్తను సూచిస్తుంది.
బాలీవుడ్ లో కూడా
టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటారు విశ్వనాథ్ గారు, ఆయన తీసిన హిట్ చిత్రాలను హిందీలో రీమేక్ చేసి విజయం సాధించారు. ‘సిరిసిరిమువ్వ’ను ‘సర్గమ్’గా, ‘శుభోదయం’ చిత్రాన్ని ‘కామ్‌చోర్’ గా, ‘శంకరాభరణాం’ సినిమాను ‘సుర్ సంగమ్’గా తీసి హిట్టు కొట్టారు విశ్వనాథ్.
‘శుభ సంకల్పం’ సినిమాతో నటుడిగా మారి ఆ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. చాలా కాలం తరువాత తీసిన ‘స్వరాభిషేకం’, ‘శుభప్రదం’ వంటి చిత్రాలు చేసినా.. నేటి ట్రెండ్ అనుగుణంగా విజయం సాధించలేకపోయారు. విశ్వనాథ్ తన చిత్రానికి దర్శకత్వం వహించేటపుడు ఖాకీ దుస్తుల్లో ఉండటం ఆయన ప్రత్యేకత.
విశ్వనాథ్ కు చలన చిత్రరంగానికి చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1992 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు పలు నంది అవార్డులు, జాతీయ అవార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఇక హిందీలో కూడా ఈయన సత్తా చాటారు. అక్కడ సిరిసిరిమువ్వ చిత్రాన్ని హిందీలో రిషీకపూర్, జయప్రదలతో ‘సర్గమ్’గా రీమేక్ చేసారు. అటు శుభోదయం మూవీని‘కామ్‌చోర్’గా తెరకెక్కించారు. శంకరాభారణం చిత్రాన్ని ‘సుర్ సంగమ్’గా రీమేక్‌గా చేసారు. ఇక చివరగా 2010లో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘శుభప్రదమ్’ సినిమాను డైరెక్ట్ చేసారు. అటు శుభసంకల్పంతో ముఖానికి రంగేసుకున్నారు. ఆ తర్వాత నటుడిగా నరసింహానాయుడు, అల్లరి రాముడు, ఠాగూర్, వజ్రం, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాల్లో నటించారు. చివరగా 2022లో కన్నడ చిత్రం ‘ఒప్పంద’లో నటించారు. తెలుగులో చివరగా రామ్ హీరోగా నటించిన ‘హైపర్’లో ముఖ్యమంత్రి పాత్రలో నటించారు.
కేంద్రం ఆయన్ని 2016లో దేశంలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. ఎన్ని చిత్రాలు తీసినా తన చిత్రాల్లో భావుకత, ఆర్ధ్రత, కుటుంబ, సామాజిక అంశాలు సృజించడంలో విశ్వనాథ్ శైలే వేరు.
ఆయన జీవితంపై ప్రముఖ దర్శకుడు జనార్దన మహర్షి..‘విశ్వదర్శనం’సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన తీసిన సినిమాలు ఇప్పటి దర్శకులకు ఒక ఆదర్శం. తెలుగు సినిమా ఉన్నంత కాలం కె. విశ్వనాథ్ సినిమాలు నిలిచే వుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మృతిపై తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయనాయకులు, వివిధ సాహిత్య, కళా సంస్థల ప్రతినిధులు, చిత్రసీమ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.