చిక్కోలు చిన్నోడు – స్వర్గానికెళ్ళాడు

సీనియర్ సినీ నటుడు శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండు మాసాలుగా అనారోగ్యంతో బెంగుళూరు, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతిచెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు.

1974లో రామరాజ్యం సినిమాలో హీరోగా పరిచయమై వచ్చిన శరత్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా అనే సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాలు అనేకం విజయవంతమయ్యాయి. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమ కింకరుడు, అమరజీవి ఇలా అనేక సినిమాల్లో నటించారు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. శరత్ బాబు కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శరత్ బాబు. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 250కి పైగా సినిమాలలో నటించారు. లెజెండరీ డైరెక్టర్ కే బాలచందర్ తెరకెక్కించిన గుప్పెడు మనసు మూవీతో శరత్ బాబు వెలుగులోకి వచ్చారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో అలరించారు. చివరిగా పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ సినిమాలో కనిపించారు. సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపైనా మంచి పాత్రలు పోషించారాయన. ఈటీవీ అంతరంగాలు, జనని, అగ్నిగుండాలు సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.
శరత్ బాబు 1974లో ప్రముఖ లేడీ కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. అయితే ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 1988లో విబేధాలతో ఆమెతో విడిపోయారు. అనంతరం 1990లో స్నేహ నంబియార్ అనే మహిళను వివాహం చేసుకున్నారు శరత్ బాబు. ఆమెతో కూడా బంధం సవ్యంగా సాగలేదు. 2011లో విడాకులు తీసకొని విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నట్లు సమాచారం.

శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. సత్యన్నారాయణ దీక్షితులుగా పిలుచుకునే శరత్ బాబును ఆయన కుటుంబకులు సత్యం బాబుగా పిలుస్తారు. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు పొందిన శరత్ బాబు మృతి చెందడం ఆముదాలవలస లో విషాదఛాయలు అలుముకున్నాయి.

శరత్ బాబు మృతిని ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. శరత్ బాబు చాలా మంచి వ్యక్తి అని, ఆమదాలవలస వస్తే అందరితో సరదాగా ఉండేవారని, అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని గుర్తుచేసుకుంటున్నారు.

శరత్ బాబు తల్లిదండ్రులు విజయ్ శంకర్ దీక్షిత్, సుశీల ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి ఆమదాలవలసకు వలస వచ్చారు. అక్కడ మొదట్లో రైల్వే క్యాంటీన్ నడిపేవారు. ఆ తరవాత ఆమదాలవలసలో హోటల్ పెట్టారు. 1951 జులై 31న ఆమదాలవలసలోనే శరత్ బాబు జన్మించారు. శరత్ బాబుది చాలా పెద్ద కుటుంబం. ఆయనకు ఏడుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. శరత్ బాబు తన తల్లి సుశీల పేరు మీద ‘సుశీల సదన్’ అని ఆమదాలవలసలో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది. కాకపోతే బాగా పాతబడింది. చెన్నైలో కూడా శరత్ బాబు ‘సుశీల సదన్’ పేరుతోనే ఇల్లు కట్టుకున్నారని ఆయన మిత్రులు చెప్పారు.

ఆమదాలవలసలో ఉన్న ఇంట్లో శరత్ బాబు అన్నదమ్ములు కుటుంబాలు ఉంటున్నాయి. అయితే, వారంతా శరత్ బాబు అంత్యక్రియల నిమిత్తం చెన్నై బయలుదేరి వెళ్లారు. కాకపోతే ఆయన రెండో వదిన, చిన్న తమ్ముడు ఆమదాలవలసలోనే ఉండిపోయారు. చిన్న తమ్ముడు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయనతో పాటు చిన్న వదిన కూడా ఉండిపోయారు. శరత్ బాబు మృతిపై ఆమె స్పందిస్తూ.. తమ కుటుంబానికి తీరని లోటని అన్నారు. తనను వదినలా కాకుండా తల్లిలా చూసుకునేవారని చెప్పారు. తన కన్నవారిది సామర్లకోట అని.. ఆమదాలవలస నుంచి మద్రాసు వెళ్లేటప్పుడు శరత్ బాబు సామర్లకోటలో దిగి తమ కుటుంబంతో ఎంతో సరదాగా గడిపేవారని ఆమె వెల్లడించారు.

శరత్ బాబు చివరిసారిగా మూడేళ్ల క్రితం ఆమదాలవలస వచ్చారని ఆవిడ చెప్పారు. గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయం ప్రారంభోత్సవానికి శరత్ బాబు వచ్చారన్నారు. శరత్ బాబు బీఎస్సీ చదువుకున్నారని.. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవారని తెలిపారు. ఎనిమిది మంది అన్నదమ్ములు అయినప్పటికీ ఎంతో కలిసి మెలిసి ఉంటారని.. అన్నదమ్ముల భార్యలను, పిల్లలను కూడా శరత్ బాబు ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని చెప్పారు.

Scroll to Top