నటచంద్రునికి కన్నీటి వీడ్కోలు

సహజనటుడు చంద్రమోహన్ కి కడపటి వీడ్కోలు

తెలుగు చిత్రసీమలో సహజనటుడు చంద్ర మోహన్. ఆయన అంత్యక్రియలు సోమవారం (నవంబర్13న) పంజాగుట్ట లోని స్మశానవాటికలో జరిగాయి. చంద్రమోహన్ తీవ్ర అనారోగ్యం కారణంగా నవంబరు 11న కన్నుమూశారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో నేడు అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర జరిగింది. అశ్రునయనాల మధ్య ఆయన అంతిమ సంస్కారాలు ముగిశాయి. చంద్రమోహన్ సోదరుడు దుర్గాప్రసాద్ అంతిమ సంస్కారాలు జరిపారు. చంద్రమోహన్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు కడసారి నివాళులు అర్పించారు.

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న చంద్రమోహన్‌ జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న చంద్రమోహన్ ఏలూరులో వ్యవసాయ శాఖ ఉద్యోగిగా పనిచేశారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి ఈయన చాలా దగ్గరి బంధువు. తమ్ముడి వరస అవుతారు. 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే, 1987లో ‘చందమామ రావే’ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నారు.

తొలినాళ్లలో ‘కొత్త నీరు’ వంటి చిత్రాలతో సీరియస్ హీరోగా నటించిన చంద్రమోహన్ తర్వాత తన పంథా మార్చుకున్నారు. ‘బంగారు పిచుక’ వంటి సినిమాల నుంచీ ఆయనలోని కామెడీ యాక్టర్ బయటికొచ్చారు. ‘గంగ మంగ’ వంటి కొన్ని చిత్రాల్లో విలనిజం చూపించారు.

సినిమాలో తనది హీరో కేరెక్టరా.. కాదా? అని చూసుకున్నదే లేదు చంద్రమోహన్. వచ్చిన పాత్రకు తగిన న్యాయం చేయడమనే థియరీ పక్కాగా ఫాలో అయ్యారాయన. ‘రెండు రెండ్లు ఆరు’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో కామెడీ హీరోగా టాలెంట్ చూపారాయన. ‘అల్లుడు గారు’ మూవీతో ఫుల్ టైం కేరెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు చంద్రమోహన్. తర్వాత వచ్చిన ‘గులాబీ’తో తండ్రి పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచీ వరుస సినిమాలు. నువ్వు నాకు నచ్చావ్, 7జీ బృందావన్ కాలనీ, అతనొక్కడే వంటి చిత్రాల్లో హీరో ఫాదర్ గా 100 పర్శెంట్ ఫిట్ అనిపించుకున్నారు.

అతనొక్కడే చిత్రానికిగానూ చంద్రమోహన్ బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డునందుకున్నారు. అంతేకాదు చిరంజీవి హీరోగా నటించిన ‘ఇద్దరు మిత్రులు’, బాలకృష్ణ హీరోగా నటించిన ‘యువరత్న రాణా’, నాగార్జున హీరోగా నటించిన ‘సీతారామరాజు’, వెంకటేష్ హీరోగా నటించిన ‘గణేష్’ సినిమాల్లో టాలీవుడ్ సీనియర్ హీరోలకు తండ్రిగా నటించి మెప్పించారు. ’రాఖీ’ లో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు.

దూకుడు, యముడికి మొగుడు,చివరగా అల్లు అర్జున్ హీరోగా నటించి ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇన్నేళ్ల కెరీర్‌లో తమిళంలో ఐదు, కన్నడ, మలయాళ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించారు. ఇక ఈయన సరసన ఎక్కువ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఘనత జయసుధ. అటు రాధిక, విజయశాంతి వంటి హీరోయిన్స్‌తో 15 పైగా చిత్రాల్లో హీరోగా నటించడం విశేషం. మొత్తంగా 55 ఏళ్లకు పైగా కెరీర్‌లో 930 చిత్రాల్లో నటించారు. అందులో 175 చిత్రాల్లో హీరోగా నటించారు.

చంద్రమోహన్ తన మొదటి సినిమా ‘రంగులరాట్నం’ లో చేసిన నటనకు ఎన్నో ప్రసంశలు అందుకున్నారు. ఆ తరువాత తనదయిన శైలిలో నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అద్భుత నటుడు చంద్రమోహన్. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అయితే చంద్రమోహన్ కి పాటలు పాడటం అంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పారు ఒక సందర్భంలో.

నటుడు చంద్రమోహన్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, కళా తపస్వి కె విశ్వనాధ్ అందరూ అన్నదమ్ములు వరుస అవుతారని, దగ్గర బంధుత్వం ఉందని అందరికీ తెలిసిన విషయమే. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కూడా స్వయానా చంద్రమోహన్ కి మేనల్లుడు అవుతారు, అతనే ఇప్పుడు చంద్రమోహన్ అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షించారు.

కథానాయకుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించి.. కథానాయకుడిగా, విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా, అనేకరకాలైన వైవిధ్యమున్న ఎన్నో పాత్రల్లో చంద్రమోహన్ మెప్పించారు. ఎటువంటి పాత్ర అయినా అది వినోదాత్మకం అయినా, సీరియస్ పాత్ర అయినా తన నటనా కౌశలంతో మెప్పించే నటుడు చంద్రమోహన్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత బాగా నటించే నటుల్లో చంద్రమోహన్ ఒకరుగా చెప్పొచ్చు. ఒక సందర్భంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం అయితే, “కమల్ హాసన్ కి ఏమాత్రం తీసిపోని ఆర్టిస్టు తెలుగులో ఉన్నాడంటే అది ఒక్క చంద్రమోహనే” అని చెప్పారు కూడా.

“నేను పాటలు పాడిన నచ్చిన అతి కొద్దిమంది నటుల్లో చంద్రమోహన్ ఒకడు. వాడు అద్భుతమైన నటుడు, ఎటువంటి భావాన్ని అయినా తెర మీద చూపించగల గొప్ప నటుడు. నా ఆల్ టైం ఫేవరెట్ నటుడు చంద్రమోహన్” అని చెప్పుకున్నారు బాలు ఒక సందర్భంలో. అంతే కాదు దర్శకుడు కె విశ్వనాధ్ కూడా చంద్రమోహన్ ని ఒక గొప్ప నటుడిగా అభివర్ణించారని బాలు చెప్పారు ఆ సందర్భంలో. నిజంగా చంద్రమోహన్ అంత గొప్ప నటుడనే విషయంలో ఎట్టి సందేహం లేదు.

చంద్రమోహన్‌ కు శోభన్ బాబు, మురళీమోహన్ మంచి స్నేహితులు. రచయిత్రి జలంధరను చంద్రమోహన్ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు మధుర మీనాక్షి, మాధవి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి కూడా డాక్టరే. ఆమె చెన్నైలో ఉంటున్నారు.

Scroll to Top