మనసుకవి..మాటల మహర్షి.. ఆచార్య ఆత్రేయ
ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు. వేదాంతం, తర్కం,మనసు నిలువెత్తు మనిషిగా సాక్షాత్కరిస్తే ..ఆయనే ఆత్రేయ. అందరూ రాసినట్టు గా ఆయన మాటల్ని కలంతో కాకుండా.. హృదయంతో రాస్తాడు. మనసు లోతుల్ని అన్వేషించి… బావోద్వేగాల్ని వెలికితీస్తాడు. అందుకే ఆయన రాసిన సంభాషణలు … ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. సందర్భమేదైనా సరే సన్నివేశం ఎలాంటిదైనా సరే ఆత్రేయ కలం పడితే చాలు… మాటలు ఉద్వేగపు ఊటలూరి జన హ్రుదయాల్ని ఆర్ధ్రంగా తట్టి… అంచనాలకు అందని అనుభూతుల తీరాలకు తీసుకొని వెళతాయి. అందుకే ఆయన రాసిన మాటలు తెలుగు తెరపై ప్రత్యేక అలంకారాలుగా గా భాసిల్లుతున్నాయి.
ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. 1921, మే 7 న సూళ్లూరుపేటలోని మంగళం పాడులో జన్మించారు. 1950లో విడుదలైన ‘దీక్ష’ చిత్రంలో ఆయన గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సంభాషణల రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. ఇంద్రధనుస్సు రంగుల హంగులను ప్రేక్షకులకు అందించి, ఆనందభరితులను చేశారు.
తాత్విక ధోరణితో సంభాషణలు..
ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. “వెలుగు నీడలు” చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, శృంగార భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.
గొప్ప వేదాంతి..
ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. “వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి” అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు..అనెది ఆయన అభిప్రాయం.
ఆణిముత్యాల్లాంటి పాటలు..
ఆత్రేయ రాయడం లేట్ చేసినా… ఎంతో మంది దర్శకులకు తమ సన్నివేశాలు పండాలంటే ఆయనే ఉండాలని ఫీలయ్యేవారు. అందుకే ఆత్రేయ జాప్యాన్ని హృదయ పూర్వకంగానే భరించే దర్శకనిర్మాతలు చాలా మంది ఉండేవారు. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, కె.యస్ .ప్రకాశరావు . వీరిద్దరికీ ఆత్రేయ దాదాపు అన్ని చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు అందించారు. ఆత్రేయ 1400కి పైగా సినిమా పాటలు రాశారు. వాటిల్లో 100కి పైగా మనసు పాటలే ఉన్నాయి. మనసు అనే ముడి పదార్ధంతో ఆత్రేయ రాసినన్ని పాటలు ఏ ఇతర కవీ రాయలేదు. మౌనం మనసు భాష అంటూ మొదలుపెట్టి… ”మనిషికి మనసే తీరని శిక్ష.. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష.” అంటూ మాట్లాడి… మనసొక మధుకలశం..అంటూ ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు ఆత్రేయ.
మాటల రచయితగా :
ఆత్రేయ పాటల రచయిత మాత్రమే కాకుండా, అనేక సినిమాలకు మాటల రచయితగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రేమనగర్ సినిమా విజయంలో ఆత్రేయ రాసిన పాటలు, మాటలు ముఖ్యభూమిక వహించిందంటే అతిశయోక్తి కాదు. అందులో, మచ్చుకు ప్రేమ్ నగర్ సినిమాకు రాసిన మాటలు కొన్ని :
“డోంట్ సే డ్యూటీ. సే బ్యూటీ. బ్యూటీని చెడగొట్టేదే డ్యూటీ.”
“నిలకడ కోసం, ఏ మాత్రం నిలకడ లేని వా దగ్గర కొచ్చారా ?” (ఇంటర్వ్యూ సన్నివేశం)
“ఇక్కడనుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్థలం అంతా మాదే. కాని, చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు. ఇటు రెండడుగులు.”
పాటలలో మేటి:
మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని “మనసున మనసై బ్రతుకున బ్రతుకై” పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీగా లబ్ధప్రతిష్ఠుడైన శ్రీరంగం శ్రీనివాసరావు.
వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే …… సినిమాలో “కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిచాన” పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.
మరోచరిత్ర సినిమాకి రాసిన పాటలులో..
ఏ తీగ పువ్వునో…ఏ కొమ్మ తేటినో…
పదహారేల్లకు…నీలో నాలో
బలే బలే మగాడివోయ్ …నీ అన నీ దానినోయ్…అనే పాటలు ఇప్పటికి శ్రోతలని అలరిస్తూనే ఉన్నాయి.
‘ఇది కథ కాదు’లో ‘సరిగమలు గలగలలు…’, ‘స్వాతిముత్యం’లో ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య…’ తోపాటు ‘తేనే మనసులు’, ‘ప్రైవేట్ మాస్టర్’, ‘బ్రహ్మాచారి’, ‘మట్టిలో మాణిక్యం’, ‘బడి పంతులు’, ‘పాపం పసివాడు’, ‘భక్త తుకారం’, ‘బాబు’, ‘జ్యోతి’, ‘అందమైన అనుబంధం’, ‘గుప్పెడు మనసు’, ‘ఆకలి రాజ్యం’, ‘అభిలాష’, ‘కోకిలమ్మ’, ‘అభినందన’, ‘ప్రేమ’ వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను ‘మనసు కవి’గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని అతని సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు. చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న కాలధర్మం చెందారు.
గొప్ప నివాళి
ఆత్రేయుడు అంటే చంద్రుడు. వెన్నెలంత వేడిగా వెన్నెలంత చల్లగా తెలుగుజాతికి మనసైన పాటలందించిన మనసు కవి, మరిచిపోలేని మాటలందించిన మనసున్న కవి. తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఆయన ఓ చెరిగిపోని తీపి గుర్తు. అరుదైన అక్షరయోగి, మాటల మహర్షి ఆచార్య ఆత్రేయ. అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించారని చెప్పవచ్చు.