కాళిదాసు రచయితకు సత్కారం

ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన ఉగాది సందర్భంగా ‘తెలుగుమల్లి మరియు భువనవిజయం’ అధ్వర్యంలో మెల్బోర్న్ నగరంలో జరిగిన అత్యద్భుత రంగస్థల నాటకం శ్రీ మహాకవి కాళిదాసు నాటకం గురించి అందరికీ తెలిసిందే. ఈ నాటకం సిడ్నీ వాస్తవ్యులు శ్రీ తూములూరి శాస్త్రి గారు వ్రాయగా ఉగాది కార్యక్రమంలో ఆ పుస్తకం  ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణా ప్రభుత్వం ఈ నాటక ప్రతులను తెలంగాణా రాష్ట్రంలోని సుమారు 300 ప్రభుత్వ గ్రంథాలయాలకు పంపిణీ చేసారన్న విషయం పాఠకులందరికీ తెలిసిందే.

ఇటీవల శ్రీ తూములూరి శాస్త్రి గారు భారతదేశ పర్యటన చేసిన సందర్భంగా వారికి హైదరాబాదులో అపూర్వ సన్మానం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.  2022, సెప్టెంబరు 14వ తేదీన రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాజీ భారత ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు శ్రీ శాస్త్రి గారి “భారతీ విలాసం” (శ్రీ మహాకవి కాళిదాసు – నాటకం) పుస్తక రచనను మెచ్చుకుంటూ సన్మానం చేయడం జరిగింది. శ్రీ వెంకయ్యనాయుడు గారు భారతీయ సాహితీ వాజ్మయంలో ధ్రువతార మహాకవి కాళిదాసు గురించిన నాటకం పుస్తక రూపంలో ప్రచురించి రంగస్థల నాటకంగా విదేశంలో ప్రదర్శించడం ఎంతో శ్లాఘనీయమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త శ్రీ సుబ్బిరామిరెడ్డి గారు పాల్గొన్నారు.

గతవారం జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక ప్రత్యేక సలహాదారులు శ్రీ కె.వి.రామాణాచారి గారు ఆధునిక యుగంలో కాళిదాసు నాటకం వ్రాయడం మరియు రంగస్థలంపై  ప్రదర్శించడం కళలపై ముఖ్యంగా రంగస్థల నాటకాలపై ప్రజలకు ఆసక్తి పెంచుతుందని తద్వారా ఎంతోమంది కళాకారులకు మళ్ళీ వృత్తి పరంగా ఆశాభావం కలుగుతుందని చెప్పారు.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర మహిళా విద్యాలయ తెలుగు అధ్యయన శాఖాధిపతి శ్రీమతి కొలకలూరి మధుజ్యోతి మరియు ఇతర అధ్యాపకులను కలిసి కాళిదాసు నాటక ప్రతులను అందజేయగా వారు ఎంతో సంతోషించారు. అక్కడి విద్యార్థులకు ఉపయోగపడడానికి వారి గ్రంథాలయంలో కూడా ఈ ప్రతులను ఉంచుతామని శ్రీమతి మధుజ్యోతి గారు చెప్పారు.

తెలంగాణా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ అయాచితం శ్రీధర్ గారిని, ఈ నాటక ప్రతికి ముందు మాట వ్రాసిన ప్రముఖ రచయిత, నటులు, దర్శకులు, తత్త్వవేత్త శ్రీ తనికెళ్ల భరణి గారిని మరియు ప్రముఖ నటి జమున రమణారావు గారిని కూడా శ్రీ శాస్త్రి గారు కలవడం జరిగింది.

శ్రీ తూములూరి శాస్త్రి గారి గురించి…

1980 దశకంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి వచ్చి 1988లో తెలుగు పలుకు పత్రికను స్థాపించి 15 ఏళ్ళు ప్రతీ నెలా ఆస్ట్రేలియాలోని తెలుగువారందరికీ పంపిణీ చేసారు.  ఈ ప్రయాణంలో ఇదేళ్ళకు  “తెలుగు వెన్నెల” మరియు పదేళ్లకు  “తెలుగు వసుధ” ప్రత్యేక సంచికలు ప్రచురించడం జరిగింది.  శ్రీ పి.వి. నరసింహారావు గారు విదేశాంగ మంత్రిగా సిడ్నీసందర్శించినప్పుడు “తెలుగు పలుకు”ను చూసి, మురిసి ఎంతగానో అభినందించి పాత సంచికలను అడిగి తనతో వెంట తీసుకొని వెళ్లిన ఆప్యాయత వారిది.  “తెలుగు వెన్నెల” తెలుగు విశ్వవిద్యాలయం వారిచే పరిశోధకులకు ప్రామాణిక గ్రంధంగాను “తెలుగు వసుధ” తెలుగు విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ వారికి ప్రామాణిక పాఠ్య గ్రంధంగా నిర్ణయించబడింది.  “సమాజంపై తెలుగు సాహిత్య ప్రభావం” అన్న చిన్న అంశంతో ప్రారంభమై, వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సింహావలోకనం “తెలుగు సాహిత్య లహరీ” ఉపన్యాస పరంపర సిడ్నీలో 9 నెలల పాటు శ్రీ శాస్త్రి గారు నిర్వహించారు.

“తెలుగు సాహిత్య లహరీ” పతాకంలో, “భాగవత సాహిత్య తత్త్వ విశేషాలు” అనే అంశంపై, పోతన మహాభాగవత సాహిత్య విశేషాలతో “భాగవత సుధా లహరి” ఉపన్యాస పరంపర 15 నెలల పాటు శ్రీ శాస్త్రి గారు నిర్వహించారు. లలితా సహస్ర నామ రహస్య విశేషాలపై “లలితార్ధ సుధా లహరి” పరంపర 18 నెలల పాటు నిర్వహించి, ఈ మధ్యనే పూర్తి చేశారు.  స్వతహాగా ఆశుకవి.  సంస్కృతాంధ్ర భాషలంటే ఎంతో మక్కువ.  http://telugusahityalahari.com/ ఈ అంతర్జాలంలో వారు చేస్తున్న కార్యక్రమాలన్నీ సంక్షిప్తపరచారు.

Scroll to Top