మహోన్నత సాహితీ మూర్తిమత్వం


మహోన్నత సాహితీ మూర్తిమత్వం …రావూరి భరద్వాజ
*ఈ నెల 5 ఆయన జయంతి

తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు రావూరి భరద్వాజ . ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి, పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. నిజమైన రచయితలు ప్రజల జీవితాలలో చైతన్యం రగిలించి అభ్యుదయ అభివృద్ధి పథం వైపు శ్రమ తెలియకుండానే నడిపించి, మానసిక స్థైర్యంతో సమస్యలను ఎదుర్కొనే విధానాలను సమాజానికి అందిస్తారు. తమ రచనల ద్వారా అటువంటి సామాజిక చైతన్యానికి దారి చూపిన మహనీయుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. రావూరి భరద్వాజ నేటి మన ఆదర్శమూర్తి. ఆయన జయంతి ఈ నెల 5. ఈ సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుందాం.

రావూరి భరద్వాజ 1927 జూలై నెల 5వ తేదీన కృష్ణా జిల్లా లోని మొగులూరు గ్రామంలో నిరుపేద కుటుంబంలో రావూరి కోటయ్య మల్లికాంబ దంపతుల తొలి సంతానంగా జన్మించారు. బాల్యమంతా గుంటూరు జిల్లా, తాడికొండలో గడిచింది. చిన్నప్పటి నుండే ఎన్నో కష్టాలను చవిచూశారు. అతి చిన్న వయసులోనే తాడికొండ చెరువు ప్రక్కనే చెట్టు క్రింద, ప్రక్కనే ఉన్న గుడిలో నివసించిన అనుభవాలు ఆయనకు లభించాయి. కుటుంబానికి పెద్ద కొడుకుగా కుటుంబ భారాన్ని మోసే దిశగా ఆయన విద్యాభ్యాసం అనేక ఇబ్బందుల మధ్య 8వ తరగతి వరకే సాగింది.15 సంవత్సరాల వయస్సు నుండే ఆయన చిన్న చితక పనులెన్నో చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా వుండడం మొదలు పెట్టారు. వ్యవసాయ కూలీ గాను, కర్మాగారాల్లో, ప్రింటింగ్ ప్రెస్సులలోను, అనాధ శరణాలయాల్లోను పనిచేసిన అనుభవం, ఆయనకు అనేక జీవిత సత్యాలను, రకరకాల మనుషులను, మనస్తత్వాలను, క్లిష్ట పరిస్థితులను అతి దగ్గరగా అవగాహన చేసుకో గలిగే అవకాశాలను కలిగించాయి. ఈ అనుభవాలే ఆయనను సాహిత్యం వైపు అడుగులు వేయడానికి గట్టి పునాదులను వేశాయి. తెలుగు జాతి గర్వించ దగ్గ రచయితగా నిలబెట్టాయి.

ఎటువంటి ప్రతికూల పరిస్థితులున్ననూ వెరవక నిజాయితీగా తన జీవన సమరాన్ని కొనసాగిస్తూ ఎన్నడూ తప్పుడు పనులను చేయకుండా రోజువారి కూలీగా, హోటల్ లో సర్వర్ గాను ఇలా ఎన్నో ఇబ్బందులను అధికమించారు. కారణం, తన జన్మకు ఒక సార్ధకత చేకూర్చాలనే బలమైన సంకల్పం అంతర్లీనంగా ఆయన ఆలోచనలలో ఉండటం, అందుకు సరిపోయే ఆత్మస్థైర్యం తన వద్ద ఉండటమే.

1946వ సంవత్సరంలో భరద్వాజ నెల్లూరు నుండి వెలువడే ప్రముఖ ప్రాంతీయ పత్రిక “జమీన్ రైతు” లో సంపాదకీయ విభాగంలో పనిచేసి, ఆ పత్రిక అభివృద్దిలో కీలక పాత్ర పోషించారు. దొరికిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన చక్కటి సంపాదకుడిగా, రచయితగా ఎదిగారు.

బాల్యం నుండి ఆయనకు చలం రచనలంటే ఎంతో మక్కువ. ఆయనపై చలం రచనల ప్రభావం ఎంతో వుండేది. నెల్లూరు నుండే వెలువడే మరో ప్రముఖ వార పత్రిక “దీన బంధు” ఆయన ప్రతిభను గుర్తించి ఆయనకు సంపూర్ణ సంపాదకుని భాద్యతలను అప్పగించింది. ఈ అవకాశం ఆయన ప్రముఖ రచయితగా వెలగడానికి బాటలు వేసింది. ఇక అక్కడి నుండి ఆయన వెనుతిరిగి చూడ లేదు.

భరద్వాజ వివాహం 1948 మే నెల 28వ తేదీన శ్రీమతి కాంతం గారితో జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. రవీంద్రనాథ్, గోపీచంద్, బాలాజీ, కోటేశ్వరరావు మరియు పద్మావతి.

1949లొ భరద్వాజ గారు తెనాలి చేరి, ప్రసిద్ద మాస పత్రికలు జ్యోతి, రేరాణి, అభిసారిక, చిత్రసీమ, యువ లకు పనిచేసి ఆయా పత్రికల అభివృద్దికి తన వంతు కృషి చేసారు. తెనాలి నుండే వెలువడే మరో మాస పత్రిక ” సమీక్ష” పురోగతికి తనదైన సేవలందించారు.1959 లో ఆయన ఆలిండియా రేడియోలో సహాయ రచయితగా చేరారు. అక్కడ ఆయన వ్యాఖ్యాతగా, ప్రాయోజిత కార్యక్రమాల నిర్మాతగా అంచెలంచెలుగా ఎదిగి చివరకు 1987లొ ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ గావించారు. 1986 ఆగస్ట్ 1వ తేదీన ఆయన ధర్మ పత్ని కాంతం ఆయనను ఒంటరి వాడిని చేసి వెళ్లి పోయింది. భార్యా వియోగం ఆయనను ఎంతో క్రుంగ దీసింది.

1950లొ ముద్రించబడిన రాగిణి అనే పుస్తకం భరద్వాజ గారి ప్రధమ రచన. అలనాటి ప్రముఖ రచయిత శ్రీ గుడిపాటి వెంకటా చలం ఈ పుస్తకానికి తన అమూల్యమైన అభిప్రాయాన్ని తొలి పలుకుగా అందించడం విశేషం. తన 2వ రచన కొత్త చిగుళ్ళు అనే కదా సంపుటిని భరద్వాజ గారు తన అభిమాన రచయిత చలం గారికి అంకితమిచ్చి, చలం గారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. భరద్వాజ గారి కలం నుండి 170 కి పైగా రచనలు వెలువడ్డాయి. అందులో కధలు, నవలలు, కధానికలు, నాటకాలు, పద్యాలు, ఆత్మ కధలు మొదలైనవెన్నో వున్నాయి.

మూడు మెతుకులు కూడా లేని రోజుల్లో మూడు రూపాయలు ఇచ్చి తనను సాహిత్య రంగం వైపు ప్రోత్సహించిన తన మిత్రునికి కృతజ్ఞతాపూర్వకంగా తనకు జ్ఞానపీఠ అవార్డును సంపాదించిన ‘పాకుడురాళ్ళు’ నవల ఆ మిత్రునికే అంకితమిచ్చిన గొప్ప వ్యక్తి మన భరద్వాజ గారు. ఇలా ఎన్నో మానవతా కార్యాలను, అడక్కుండానే సహాయాన్ని అందించి తన మనస్సు చెప్పిన మాటను ఆచరించి చూపిన మహా మనీషి. తన జీవితంలో తారసపడి తనకు సహాయం చేసిన, సలహాలను ఇచ్చిన ప్రతి ఒక్కరినీ జీవితాంతం గుర్తుపెట్టుకున్న నిజమైన మానవతావాది.

కత్తి కంటే కలం గొప్పది అనే సిద్ధాంతాన్ని నమ్మి తన రచనల ద్వారా సమాజంలో మార్పును చైతన్యాన్ని ఆశించి మానవాళి మనుగడకు, మానవత్వానికి మార్గదర్శకునిగా నిలిచి సమాజ పోకడల మీద చక్కటి అవగాహనతో, తన సాహిత్య పటిమను ఉపయోగించి బడుగు వర్గాల నిజజీవిత కష్టాలను స్వానుభవంతో అర్థం చేసుకుని వారి అభ్యున్నతికి పాటుపడ్డాడు. కనుకనే జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారానికి అర్హత సంపాదించారు. నేటి వరకు విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణ రెడ్డి తరువాత ఆ పురస్కారాన్ని పొందిన మూడవ వ్యక్తి భరద్వాజ మాత్రమే.

భరద్వాజ తన జీవన గమనంలో 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు. జమీన్ రైతు, దీన బంధు తదితర పత్రికలలో పనిచేసి ఆ తరువాత ఆకాశవాణిలో చేరి అక్కడే పదవీ విరమణ చేశారు.

సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో ఇదిఅతి ముఖ్యమైనది. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే రాసిన ‘పాలపుంత’ అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా రాశారు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషంఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన.

రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన బహుముఖ కృషికి గుర్తుగా 2012 వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం ఆయనను వరించింది. ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు కానీ ఏనాడు ఆయన వాటి కొరకు అర్రులు జాచలేదు. ‘ఒక చిరునవ్వు ముందు, ఒక దయామయమైన చూపు ముందు, ఒక అద్భుతమైన, ఆత్మీయ కరచాలనము ముందు ఏ పురస్కారాలు, ప్రశంసలు సరిపోవు.’ అని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ లో భరద్వాజ చెప్పారు. 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఆకలితో అలమటించి అన్నం దొరకక రెండు దోసిళ్ళ నీరు తాగి కడుపునింపుకున్న ఆయన తన అనుభవాలు, తన చుట్టూ రోజూ చూస్తున్న సమాజ కష్టనష్టాలను ప్రత్యక్షంగా గమనించి, వాటికి అక్షర రూపం కల్పించి సమాజానికి అందించిన గొప్ప సాహితీ నిష్ణాతుడు. చదువు లేకపోయినా సమాజమే విద్యాలయంగా మలుచుకొని నాటి సామాజిక స్థితిగతులను, వాస్తవ పరిస్థితులను తన రచనల ద్వారా ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించిన మహోన్నత వ్యక్తి భరద్వాజ. 2013 అక్టోబరు 18న రావూరి భరద్వాజ తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.

Scroll to Top