సాహితీ వెలుగుల వెల్లువ

భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు. దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి…. ఇటువంటి పర్వదినం రోజు కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలు దీపావళి ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. కొత్త బట్టలు, టపాసులు, స్వీట్లు ఇలా ఎన్నో వాటితో ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. దీపావళి రోజున దీపాల తో ఇల్లంతా కళకళలాడిపోతుంది.

దీపావళి రోజున చీకటిని పారద్రోలుతూ.. వెలుగులు తెచ్చే పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇలా విజయానికి ప్రతీకగా ఈ పండుగను అంతా కలిసి జరుపుకోవడం జరుగుతుంది. పిండి వంటల తో రంగవల్లికల తో ఆశ్వయుజ అమావాస్య రోజున ఈ దీపావళి పండుగని జరుపుకుంటారు. అమావాస్య ముందు వచ్చే ఆ చతుర్దశి నాడు నరక చతుర్దశి గా జరుపుకుంటారు. తర్వాత రోజే దీపావళి. ఈ వెలుగుల పండుగ సాహిత్యంలో ఎన్నో చైతన్యదీప్తులను అందించింది. వాటిలో కొన్నింటిని ఈ సందర్భంగా ముచ్చటించుకుందాం.

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదం
శత్రు వృద్ది వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే
దీపం జ్యోతి పర బ్రహ్మ దీపంజ్యోతి జనార్దనః
దీపోహారతి పాపాని సంద్యా దీప నమోస్తుతే !

సకల కళ్యాణ ప్రదము, ఆరోగ్యము, ధనము, శత్రువులపై విజయము ప్రసాదించు దీపమునకు నమస్కరించుచున్నాను, ఈ దీపము, పర బ్రహ్మ మహావిష్ణు స్వరూపము, సకల పాపములు హరించు సంద్యా దీపమునకు నమస్కారము అని ఈ శ్లోకమున దీప ప్రాశాస్త్యమును చెప్పుచున్నారు. సంధ్య అనగా మూడు సంద్యలు అని అర్ధము.
———-
దీపావళి – వేదుల సత్యనారాయణ శాస్త్రి
దీపావళినాఁడు

నిశీథిని
జగతి యీనాఁటి యీ మహోత్సవమునందు
మునిగి యానందమునఁ బొంగిపోవుచుండ
ఇటు రగులుగొల్పి రెవరు నీ హృదయమందు

నణఁచుకొనియున్న ఘోరదుఃఖానలమ్ము

నేను
కాఱుకొన్న యమాసచీఁకటుల నడుమ
నే నొకండనె యీ శూన్యనిలయ మందు
అదురువడిపోయి, మరణవాద్యమ్ము లట్లు
గుండియలు కొట్టుకొన నేడ్చుకొనుచు నుంటి

ఇంతగ దహించుకొనిపోవు నీ యెడంద
బాష్పములు జారిపడి చల్లఁబడునొ యనుచు
మూసికొనిపోయె నా నేత్రములు తమంత
రాత్రియే యింక బహిరంతరముల నాకు

లోన జ్వలియించుచున్న మహానలమున
కొక స్ఫులింగమె కాద యీ యుత్సవాగ్ని
శైశవ మ్మాది ప్రేమశ్మశానమైన
జీవి కొకఁనాటి కేటి దీపావళి యిఁక

విస్మృతోదంతములు శూన్యవీథులందు
నావలెనె మౌనముగ వెళ్ళిపోవుచున్న
యో నిశీథిని! నీ వినీలోదరమున
దొరకె నీ దురదృష్టవంతునకుఁ జోటు

చిమ్మట
బాణసంచుల ఫెళఫెళార్భటులు విరిసి
దశదిశాంతరములఁ బ్రతిధ్వనుల నీన
పేదవడియున్న మౌనజీవితపుటాశ
లిపుడు మ్రోగించుకొను చుంటి వేల నీవు

నేను
నన్ను నిరసించు వారి యానందమందు
నాకు భాగమ్ము వల దొక్కనాఁటి కైన
చీఁకటుల జీల్చుకొని వచ్చు మీకరాళ
గానరవములనే నా సుఖమ్ము గలదు

దినములు పరస్పర ప్రతిధ్వనులు గాగ
నిరువదైదేండ్ల నాబ్రదు కిట్టె గడచె
ఈ రహోదుఃఖవీథులం దే నెరుంగ
సఖుల యడుగుల జాడ లీ సరికిగూడ

ఎడతెరిపిలేని కన్నీటిజడులఁ దడిసి
పంకిలమ్మైన జీవనప్రాంగణమున
శాంతిదేవతాచరణ లాక్షారసారు
ణాంకలవలేశముల వెతుకాడుకొందు

గొంతువిప్పక లోలోనఁ గుమిలి కుమిలి
యెంతయేడ్చినఁ బగిలిపో దీ యెడంద
ఆఁకొనిన యాశ లెప్పటి కప్పు డెవియొ
కలయ ద్రిప్పును స్వప్నసాగరతటాల

మృత్యుగర్జాప్రవాహ గంభీరమైన
విధి నిదురవోవు ప్రేమజీవితములోన
సంఘటిలిన ప్రవాసదుస్స్వప్న వ్యథల
మడతలను సర్దుకొనుచుందు మాయకుండ

తెగిపడిన పూలదండ లెత్తుగ నమర్చి
యంధకారము సందిట నదుముకొనుచు
నెవరికొరకో పదేపదే యెదురుసూచు
నాయెద కొనర్తు కృత్రిమానందభిక్ష

మ్రొక్కినకొలందిఁ గాలితోఁ ద్రొక్కివేయు
నీ కఠినలోక మెల్ల బహిష్కృతమ్ము
రండు, చిమ్మటలార! ఈ రాత్రివేళ
నావలెనె పాడుకొను మీరె నాకు సఖులు


ఓ మంచి పాట

తెలుగు పండుగలకు ఒక్కో దానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. అందులో అతి ముఖ్యమైనది దీపావళి. దీపావళి వేడుకకు ఓ విశిష్టత ఉంది. అదేంటి అంటే పెద్దలను, పిల్లలను ఒకటిగా చేస్తుంది. అందరినీ పిల్లలుగా  మార్చేస్తుంది. ఓ పాటలో సినీ కవి అంటాడు. పెద్దలంతా పిల్లలుగా మారే రోజు , అమావాస్య నాడు  వచ్చే పున్నమి రోజు, వెన్నెల రోజు. దీపావళి రోజు అని. అంటే దీపావళి మీద  ఓ మంచి పాట అలా కుదిరింది అన్నమాట.

ఈ పాట రామయ్య తండ్రిలోనిది. రాసినది సహజకవి మల్లెమాల. ఆయన అసలు పేరు, ఎమ్మెస్ రెడ్డి. ఆయన పాటలన్నీ ఆణిముత్యాలే. ఇక విచిత్ర బంధం అని అక్కినేని, వాణిశ్రీ జంటగా మరో మూవీ ఉంది. అందులో  చీకటి వెలుగుల రంగేళి. జీవితమే దీపావళి అంటూ సాగే పాట, దీపావళి విశిష్టతను తెలియచేస్తుంది. దీన్ని మనసు కవి ఆచార్య ఆత్రేయ రాసారు.

ఇక ఆడే పాడే పసివాడా అంటూ దీపావళి సందర్భంగా వచ్చే పాట అక్కినేని  హీరోగా వచ్చిన పెళ్ళి కానుక మూవీలోనిది. ఏం రాజా సంగీతంలో వచ్చిన ఈ పాటకు   ప్రముఖ  రచయిత ఆచార్య ఆత్రేయ  సాహిత్యం అందించారు. ఇక అంజలిదేవి సొంతంగా   తీసిన  చిత్రం కన్నవారిల్లులో కూడా దీపావళి పాట అలరిస్తుంది.

దీపావళి విశిష్టతను తెలియచేస్తూ ఏకంగా అన్న నందమూరి సావిత్రి నటించిన చిత్రం కూడా ఉంది. అందులో కూడా దీపావళి పాటలు  ఉన్నాయి.

చిత్రం : ముద్దుల మనవరాలు (1986)
సంగీతం-గానం  : బాలు
సాహిత్యం : వేటూరి    

ఇన్నాళ్ళకొచ్చింది దీపావళి
తీపి కన్నీటి ప్రమిదల్లో కళికావళీ
దీపకళికావళీ

అమ్మమ్మ మనసులో
అమావస్య బ్రతుకులో
మనవరాలు తెచ్చింది
మమతల దీపావళి

ఇన్నాళ్ళకొచ్చింది దీపావళి
తీపి కన్నీటి ప్రమిదల్లో కళికావళీ
దీపకళికావళీ

చిట్టి చిట్టి అలకలూ చిటపటలూ
చిలిపి చిలిపి అల్లరులే
సీమ టపాకాయలు
వెలుగుల సురపున్నలూ చిచ్చుబుడ్లు
చీకటికీ చింతలకీ జవాబులే మతాబులు

అమ్మమ్మ కళ్ళలో ఎన్ని వెలుగు నీడలో
అమ్మమ్మ కళ్ళలో ఎన్ని వెలుగు నీడలో
ఈ వెలుగుకు తోడు నీడ ఎవ్వరో ఎప్పుడో

ఇన్నాళ్ళకొచ్చింది దీపావళి
తీపి కన్నీటి ప్రమిదల్లో కళికావళీ
దీపకళికావళీ

అమ్మమ్మ మనసులో
అమావస్య బ్రతుకులో
మనవరాలు తెచ్చింది
మమతల దీపావళి

————-
చిత్రం : షావుకారు (1950)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల
గానం : జిక్కి, రావు బాల సరస్వతి

దీపావళీ దీపావళి దీపావళీ దీపావళి
ఇంటింట ఆనంద దీపావళీ
ఇంటింట ఆనంద దీపావళీ
మా ఇంట మాణిక్య కళికావళి
మా ఇంట మాణిక్య కళికావళి
దీపావళీ దీపావళి దీపావళీ దీపావళి

జిలుగుల వలువల అళ్ళుళ్ళ తళుకు
జిలుగుల వలువల అళ్ళుళ్ళ తళుకు కూతుళ్ళ కులుకు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు మురిసిపడు చిన్నెలు
రంగు మతాబుల శోభావళి
రంగు మతాబుల శోభావళి

దీపావళీ దీపావళి
ఇంటింట ఆనంద దీపావళి
మా ఇంట మాణిక్య కళికావళి
దీపావళీ దీపావళి

చిటపట రవ్వల ముత్యాలు కురియ
చిటపట రవ్వల ముత్యాలు కురియ రత్నాలు మెరయ
తొలకరి స్నేహాలు వలుపుల వానగ
తొలకరి స్నేహాలు వలుపుల వానగ కురిసి సెలయేరుగ
పొంగే ప్రమోద తరంగావళీ
పొంగే ప్రమోద తరంగావళి

దీపావళీ దీపావళి
దీపావళీ దీపావళి
ఇంటింట ఆనంద దీపావళీ
ఇంటింట ఆనంద దీపావళీ
మా ఇంట మాణిక్య కళికావళీ
మా ఇంట మాణిక్య కళికావళీ
దీపావళీ దీపావళి
దీపావళీ దీపావళి

దీపావళి గురించి బయట కవుల కంటే సినీ కవులు ఎంతో అందంగా సగటు  జనానికి అర్ధమయ్యేలా రచనలు చేసి ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందించారు. మొత్తం మీద దీపావళి గొప్ప పండుగే కాదు. మన గురించి తెలియచెప్పే అసలైన వేడుక కూడా…

Scroll to Top