క్ష‌య రోగుల‌కు కరోనా ముప్పు

మానవ శ్వాసవ్యవస్థలో తిష్ట వేసి చివరికి ప్రాణాలను హరించే కరోనావైరస్‌ ప్రపంచంలో శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌కు ఇంకా మందు లేకపోవడంతో ఎవరికైనా సమస్యే! ముఖ్యంగా క్షయ వ్యాధి ఉన్నవారి పట్ల ఇది మరింత ప్రమాదకారిగా మారుతోంది. ఒకప్పుడు క్షయవ్యాధి వస్తే చాలు అదో ప్రాణాంతక రోగమని భావించేవారు. అప్పట్లో ఈ వ్యాధి నివారణకు తగిన మందులు ఉండేవి కావు. ఆధునిక వైద్య విజ్ఞానప్రగతిలో భాగంగా క్షయవ్యాధి నిర్మూలనకు మందులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. సకాలంలో మందులు వాడుతూ ఎంతోమంది రోగులు ఈ వ్యాధి నుంచి విముక్తులవుతున్నారు. అయితే క్షయ నుంచి కోలుకున్నవారి కన్నా ఈ వ్యాధితో ఉన్నవారిపై కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కరోనా వల్ల క్షయ రోగులకు వచ్చే ముప్పు, క్షయ లక్షణాలు, చికిత్స తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆవగాహన కోసం

మనిషి ఆరోగ్యాన్ని శరవేగంగా హరించటం ఈ వ్యాధి లక్షణం. అందుకే దీనికి ‘క్షయ’ అని పేరు పెట్టారు. ఇది ‘మైకో బ్యాక్టీరియం ట్యూబర్‌ క్యులోసిన్‌ (ఎంటిబి) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ప్రవేశించి, శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగజేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి. దీనితో బాధపడేవారే ఎక్కువమంది ఉంటారు. అయితే శరీరంలోని ఇతర భాగాలకీ క్షయవ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. శ్వాసకోశంతో సంబంధంలేని ఉదరకోశం, ఎముకలు, కీళ్లు, లింఫు గ్రంథులు, మెదడు పొరలు, మూత్ర పిండాలు, గర్భాశయం వంటి వాటికీ అప్పుడప్పుడూ క్షయవ్యాధి సోకుతుంది.
కోవిడ్‌19 లాగే క్షయా అంటువ్యాధి. ఇతరులకు వ్యాప్తి చెందే విషయంలోనూ ఒకదానితో మరొకదానికి పోలికలున్నాయి. క్షయ ఏ వయసులోనైనా, ఎవరికైనా సోకవచ్చు. జనాభాలో 40 శాతం మందికి పెద్ద వయసు వచ్చేసరికి క్షయ సోకుతుంది. అయితే వీరిలోని రోగనిరోధక శక్తి వల్ల అది వ్యాధిగా మారదు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారికి వేగంగా ఈ వ్యాధి సోకుతుంది. క్షయ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. క్షయ వ్యాధితో బాధపడేవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, చీదినప్పుడు, మాట్లాడినప్పుడు, ఉమ్మినప్పుడు క్షయ వ్యాధికారక సూక్ష్మజీవులు ఆరోగ్యవంతులకు గాలి ద్వారా సోకుతాయి. దగ్గినపుడు, అతని ఊపిరితిత్తుల నుండి వచ్చే కఫం ద్వారా ఈ బ్యాక్టీరియా గాలిలో చేరి, దగ్గరలో ఉన్న ఆరోగ్యవంతమైన మనిషి పీల్చే గాలితోపాటు అతని ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, జబ్బుకి పునాది వేస్తుంది. క్షయ వ్యాధి సోకిన వ్యక్తి తగిన చికిత్స తీసుకోకపోతే అతని ద్వారా సగటున ఏడాదిలో 10 నుంచి 15 మందికి ఇది సోకుతుంది.

లక్షణాలు
రోగిలో వ్యాధి లక్షణాలు స్పష్టంగా కన్పిస్తాయి.Xray
మూడు వారాలకి పైగా తీవ్రమైన దగ్గు ఉంటుంది. దానితో కఫమూ పడుతుంది.
కొన్నిసార్లు వ్యాధి బాగా ముదిరిపోతే దగ్గు, కఫంతో పాటు రక్తం పడుతుంది.
సాయంత్రం, రాత్రి సమయాలలో జ్వరం వస్తుంది.
బరువు బాగా తగ్గిపోతారు. ఆకలి కూడా మందగిస్తుంది. ఆహారంపై అయిష్టత పెరుగుతుంది.
ఎయిడ్స్‌ వ్యాధి ఉన్నవారికి అతి వేగంగా ఈ వ్యాధి సోకుతుంది.

నిర్ధారణ
కఫం (కళ్లె) పరీక్ష, రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, ఛాతీని ఎక్స్‌ రే తీయడం, ఊపిరితిత్తులు ఎంతవరకు ఈ వ్యాధికి గురయ్యాయో పరిశీలిస్తారు. వాటివల్ల కూడా సక్రమంగా వ్యాధి నిర్ధారణ జరగకపోతే, అత్యాధునిక ఎక్స్‌పర్ట్‌ ఎంటీబీ/ఆర్‌ఐఎఫ్‌ తదితర పరీక్షలు చేసి కచ్చితమైన నిర్ధారణ జరుపుతారు.

చికిత్స
శరీరంలో క్షయవ్యాధి ఏ భాగంలో ఉన్నా చికిత్సా విధానం మాత్రం ఒకటే. రిఫాంపిసిన్‌, ఐసోనెక్స్‌, ఇతాంబ్యుటాల్‌ వంటి మందులతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. ఈ వ్యాధికి కనీసం ఆరు నెలలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడాలి. మందులు వాడటం మొదలుపెట్టిన నెల రోజుల్లో రోగికి చాలావరకూ ఉపశమనం కలుగుతుంది. కానీ క్షయ క్రిములు నాశనం కావు. అందువల్ల ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా మందులు వాడాలి. చికిత్స మొదలుపెట్టిన నెలరోజులకే ఈ వ్యాధి తగ్గిపోయిందని చాలామంది మందులు వాడటం మానేస్తుంటారు. ఇటువంటి వారికి వ్యాధి తిరిగి ఆరంభమవుతుంది. క్షయవ్యాధి సోకిందని తెలియగానే ‘డాట్స్‌’ చికిత్స తీసుకోవాలి. డాట్‌ ప్రొవైడర్‌ స్వయంగా మందులు రోగితో మింగిస్తారు. పిల్లలకు ఈ వ్యాధి రాకుండా నివారించడానికి బిసిజి టీకా ఉంది. పిల్లలకు వీలున్నంత వేగంగా ఈ టీకా ఇప్పించాలి.

తప్పనిసరి నియంత్రణా చర్యలు
క్షయ రోగులు తమకు తాము వ్యాధిని తగ్గించుకోవడానికి, తాము కరోనావైరస్‌ బారిన పడకుండా ఉండడానికి, తమ వ్యాధిని ఇతరులకు సంక్రమించకుండా చూడడానికి తగిన నియంత్రణా చర్యలను పాటించాలి.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి.
దగ్గినపుడు వచ్చే కఫం ఒక పాత్రలోకి పట్టి, కాల్చివేయాలి.
ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
చేతులను శుభ్రంగా ముప్పై సెకన్లపాటు సబ్బుతోగానీ, హ్యాండ్‌వాష్‌, శానిటైజర్‌తోగానీ కడుక్కోవాలి.
వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతతో పాటు ఇళ్లలో గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి.
మంచి పోషకాహారం తీసుకుని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి.

Scroll to Top