గురక..అనేక ఆరోగ్య సమస్యలకు సూచిక


గురక అనేది చాలా సర్వసాధారణమైందిగా భావిస్తాం. తేలికగా తీసుకుంటాం. దీనికి మన గురక మనకి తెలియకపోవడం అనేది కారణం కానే కాదు. గురక వల్ల బయటపడే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన లేకపోవడమే అంటారు నిపుణులు. బయటకు కనిపించని అనేక ఆరోగ్య సమస్యలకు ఇదొక సూచిక అని ఓ తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. బీపీ, డయాబెటిస్‌ సహా పలు ఆరోగ్య సమస్యలకు ‘గురక’కు సంబంధముందని తాజా అధ్యయనంలో తేలింది.

సాధారణంగా ముప్పయి ఏళ్లలోపువారిలో సుమారు 10% మంది.. 60దాటినవారిలో 60% మంది గురక పెడుతుంటారు. నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవడం, వదలటం చేసేటప్పుడు మెడ, తలలోని మృదు కణజాలంలోకంపనలు వల్ల మనం గురక పెడుతుంటాం. బాగా అలసిపోయినప్పుడు కాకుండా ప్రతిరోజూ గురక పెట్టే అలవాటు ఉంటే.. కొన్ని ప్రమాదకర వ్యాధులకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

గురక స్ట్రోక్ ప్రమాదాన్ని 46 శాతం పెంచుతుంది. ఒకరకంగా చెప్పాలి అంటే గురక సమస్య.. స్మోకింగ్, ఆల్కహాల్‌ తాగడం వంటి చెడు అలవాట్ల కంటే కూడా ప్రమాదకరం. గురక ధమని దెబ్బతినడానికి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

గురక స్లీప్ అప్నియా కారణంగా వస్తుంటే వారికి గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువ. అలాగే గురక పెట్ట అలవాటు ఉన్నవారికి డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం 50 % ఎక్కువగా ఉంటుంది. అలాగే గురక పెట్టే వ్యక్తులకు ఇతర శ్వాస సమస్యలు ఉన్నవారకి హైపర్‌టెన్షన్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే గురక ఉన్నవారికి గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (జెర్డ్) వ్యాధి రావచ్చు. జెర్డ్ అంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గుండెల్లో మంట కలుగుతుంది. ఇది అసౌకర్యాన్ని గురిచేస్తుంది. ఈ నొప్పి మెడవరకు ప్రాకుతుంది.

గురక రావటానికి అనేక కారణాలు ఉన్నా ముందుగా చెప్పుకోవాల్సింది అధిక బరువు. ఎందుకంటే వారిలో కొవ్వు గొంతు భాగంలో పేరుకుపోయి గాలి తీసుకునే మార్గాన్ని చిన్నగా చేయడం వల్ల గురక వస్తుంది. అధిక బరువు సమస్య ఉంటే.. బరువు తగ్గడం మంచిది.

గురకపెట్టేవారు ఒకేవైపుకి పడుకోవడం వల్ల గురక సమస్యని తగ్గించుకోవచ్చు. దీంతో గాలి సులభంగా లోపలకి వెళ్తుంది. తల భాగం పైకి ఉండేలా ఉండండి. కొన్ని అంగుళాల ఎత్తులో పడుకుంటే మీ వాయు మార్గాలు తెరచుకుని గురక తగ్గుతుంది.

అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్, స్లీప్ రీసెర్చ్ సొసైటీ సంయుక్త సిఫార్సుల ప్రకారం, ప్రతిరోజూ 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం గురక ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గొంతు కండరాలను రిలాక్స్ చేస్తుంది. దీని వల్ల వాయుమార్గాల్లో అడ్డంకి ఏర్పడుతుంది. ఇది నిద్రలేమి ప్రమాదాన్ని పెంచి, నిద్రకి భంగం కలిగిస్తుంది.

పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకోవద్దని గుర్తుపెట్టుకోండి. దీని వల్ల గొంతు కండరాలు రిలాక్స్ అవుతాయి. గురకకి కారణమవుతుంది. దీని వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. కొన్ని రకాల మత్తు మందులు తీసుకోవడం వల్ల కూడా గురక వస్తుంది. కాబట్టి, వీటికి దూరంగా ఉండాలి. ధూమపానం వల్ల గురక పెరుగుతుంది. ధూమపానం వల్ల స్లీప్ ఆప్నియా సమస్య కూడా పెరుగుతుంది.

Scroll to Top