అనితర సాధ్యుడు – తెలుగు ప్రజల ఆత్మగౌరవం

అనితర సాధ్యుడు ఎన్.టి.ఆర్.చలనచిత్ర జగతిలో ఆయనొక అద్భుతంస్వచ్చమైన రాజకీయాలకు చిరునామాతెలుగు ప్రజల ఆత్మగౌరవం నందమూరి తారకరామారావుసామాన్యుడిగా మొదలై, అసామాన్యుడిగా నిలిచి, తెలుగు ప్రజల హృదయాలను గెలిచిన నందమూరి తారకరామారావు జన్మదినం మే 28. మరో రెండు నెలల్లో శతజయంత్యుత్సవాలు ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నవరసనటసార్వభౌముని  తలచుకుందాం. ఆకర్షణకు మరోపేరు అన్నగారు. స్ఫురద్రూపం, వాచకం ఆయన ప్రత్యేకం. ప్రతి అక్షరం, ప్రతి అచ్చు అచ్చంగా, స్వచ్ఛంగా  పలుకుతాయి, మనకు చేరుతాయి. ఆ కంచుకంఠంలో స్వరవిన్యాసం, నటవిన్యాసం ఏకకాలంలో  ప్రస్ఫుటంగా ప్రకటితమవుతాయి. ప్రతి రసం సహజ సంపూర్ణంగా చిలుకుతుంది. ఉచ్చారణలో ఇంతటి సహజసౌందర్య సంపూర్ణ సుగాత్రుడు తెలుగు నటుల్లోనే వేరొక్కరు లేరు. ఎన్టీఆర్ ధరించే ఆభరణాలు కూడా ధ్వనిస్తూ నటిస్తాయి. భారతచలనచిత్ర జగతిలోనే ఇది అపూర్వం.తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు  తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయారు.రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచారు.నటనలోనూ నడతలోనూ విశిష్టునిగా  నటన ఒక ఎత్తు. నడక మరో ఎత్తు. బృహన్నలగా,అర్జునుడుగా, సుయోధనుడుగా, శ్రీరాముడుగా, రావణుడుగా, శ్రీకృష్ణుడుగా ఆన్నీ ఆయనే. కానీ, అది ఎన్.టి.ఆర్ అని మనకు అనిపించదు. ఆ పాత్రలే కనిపిస్తాయి. ఆ  హావభావనట ప్రదర్శనలో వేరొకరు సాటిరారు. అప్పటి వరకూ బృహన్నలగా ఉండి,  అర్జునుడిగా మారిన వెనువెంటనే  వాచక  రూపక స్వరూపాలు చకచకా   మారిపోతాయి. ఇది ఒక నందమూరికే సాధ్యం. శ్రీకృష్ణుడి వాచకం పరమ సాత్వికం, రసరంజితం  – సుయోధనుడిది గాంభీర్యం, రాజరాజసం. ఈ రెండు పాత్రలను ఒక్కడే ఒకే చిత్రంలో పోషించి, పండించడం అమ్మకచెల్ల!  ఎన్ టి ఆర్ ఒక్కడికే చెల్లు. నడి వయస్సులో ముసలి బడిపంతులు పాత్ర పోషించడం  ఎంత సాహసమో కోడె వయస్సులో ముదిమి భీష్మ పాత్ర వెయ్యడం అంతకు మించిన సాహసం. పౌరాణిక పాత్రల కోసమే ఈయన పుట్టాడో, లేక ఆ పౌరాణిక పాత్రలే ఈయనగా పుట్టాయో  పుట్టించునోడికే ఎరుక! దాదాపు ఐదు దశాబ్దాలపాటు తెలుగుసినిమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలిగారు.సాంఘిక, చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో జీవించి, తరించారు. తరగని రసానుభూతుల్ని  కోట్లాది మందికి పంచారు ఎన్టీఆర్.జీవితంలోకి తొంగి చూస్తే..నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరారు. ఇక్కడ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఆయన ఒక నాటకములో ఆడవేషం వేయమన్నారు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి ‘ససేమిరా’ అన్నారు. మీసాలతోటే నటించడం వలన అతనుకు “మీసాల నాగమ్మ” అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె  బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పారు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరారు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (ణాట్) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో “చేసిన పాపం” వంటి ఎన్నో నాటకాలు ఆడారు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో అతనుకు బహుమతి కూడా వచ్చింది.చలన చిత్ర జీవితంరామారావు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసారు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవారు కాదు. అటువంటి ఆత్మాభిమానం ఆయనిది.రామారావు 1947లో పట్టభద్రుడయ్యారు. తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచారు. అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయారు.ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే అతనును మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే అతను తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు. అంచేత అతను మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించారు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశారు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవారు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవారు.  1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనుకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.  1956లో విడుదలైన మాయాబజార్‌లో అతను తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసారు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది.  ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. శ్రీమద్విరాటపర్వములో అతను ఐదు పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతని పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని “నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు” పతాకంపై విడుదల చేసారు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసారు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం ఆయన నటించి, దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలైంది.ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవారు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవారు. నర్తనశాల సినిమా కోసం  వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. వృత్తిపట్ల అతను నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు. ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవారు. ఆయన చివరి సినిమా మేజర్ చంద్రకాంత్.విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు గా బిరుదాంకితుడైన ఎన్.టి.ఆర్ 44 ఏళ్ళ సినిమా జీవితంలో  13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు. 1968 భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. 1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు ‘కళాప్రపూర్ణ ‘ స్వీకరించారు.రాజకీయాల్లోకి..1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని ఎన్టీఆర్ ను అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పారు. అతను చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసారు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఎన్టీఆర్ కు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించారు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించారు. దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవారు. దానిని అతను “చైతన్యరథం” అని అన్నారు. ఆ రథంపై “తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!” అనే నినాదం రాయించారు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి.ఆంధ్రప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా 1983లో ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 1984లో సినిమారంగంలో “స్లాబ్ విధానము”ను అమలుపరిచారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని శాసనమండలిని రద్దు చేసాడరు (1985 జూన్ 1 న అధికారికంగా మండలి రద్దయింది). హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై (ట్యాంకుబండ్ నందు) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పారు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో మార్చి 1985లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు.  1989-94 మధ్యకాలంలో ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందారు. ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించారు కూడా. తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నారు. రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు.1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. తెలుగు దేశం ఎమ్మెల్యేలను  ఆయన అల్లుడు చంద్రబాబు తనవైపునకు తిప్పుకుని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తర్వాత, 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు.

ఎన్టీఆర్ విశిష్టతలు 

-సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్‌. ఆంధ్ర ప్రదేశ్ లో, అతను సమకాలికుల్లో అతనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు.వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్‌దే.-పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి అతను. ఈ కారణాలవల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్నీ, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు.-తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.– స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే.– బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం అతనుకు దక్కింది.– రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.  -దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత అతను.  -ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు అతను. దేవేందర్ గౌడ్, కె.చంద్రశేఖరరావు మొదలైన నేతలు అతను పరిచయం చేసినవారే.-మదరాసులో ఎన్.టి.ఆర్ ఉనంప్పుడు తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు మదరాసు వెళ్ళి ఆయనని కూడా దర్శించుకుని వచ్చేవారు.– కొన్ని సాహసోపేత నిర్ణయాలు: మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడినకులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం– రామారావుకి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవునిపట్ల భక్తి ఉంది. బుద్ధునిపట్ల అపార గౌరవమున్నది.– బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి, మునసబు, కర్ణాల వ్యవస్థ లని రద్దు చేసి  ఆరాధ్యదైవంగా మారారు.

Scroll to Top